Telangana: పోలీసుల నిఘాలో ఎల్‌పీజీ గ్యాస్ గోడౌన్లు, ఏజెన్సీలు
తెలంగాణలో ఎల్‌పిజి సరఫరా, పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
By - అంజి |
Telangana: పోలీసుల నిఘాలో ఎల్‌పీజీ గ్యాస్ గోడౌన్లు, ఏజెన్సీలు
తెలంగాణలో ఎల్‌పిజి సరఫరా, పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా చూడాలని అధికారులను, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను (OMC) ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం (మార్చి 13, 2026) ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మరియు పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టడానికి ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ పంపిణీ కేంద్రాలు, సరఫరా ఏజెన్సీల వద్ద పోలీసు నిఘా ఉంచాలని సూచించారు.
నిల్వల లభ్యత: రాష్ట్రవ్యాప్తంగా 1.29 కోట్ల గృహ కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎస్‌కు వివరించారు. రాష్ట్రంలోని 810 పంపిణీ కేంద్రాల ద్వారా సిలిండర్ల సరఫరా జరుగుతోందని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సకాలంలో గ్యాస్ అందేలా పౌరసరఫరాల శాఖతో ఆయిల్ కంపెనీలు సమన్వయం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్‌పిజి సరఫరాలో 86% గృహ అవసరాలకే వినియోగిస్తున్నామని, వాణిజ్య సరఫరాలో వచ్చే ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.