ఆక్రమణల వల్లే.. ఖమ్మంలో భారీ వరదలు: సీఎం రేవంత్
ఖమ్మం జిల్లా వరదల్లో మునిగిపోవడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని సీఎం రేవంత్ అన్నారు. ఆక్రమణలు పెరగడంతో ఖమ్మం వరద ముంపునకు గురైందని అన్నారు.
By అంజి Published on 3 Sept 2024 12:53 PM ISTఆక్రమణల వల్లే.. ఖమ్మంలో భారీ వరదలు: సీఎం రేవంత్
ఖమ్మం జిల్లా వరదల్లో మునిగిపోవడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని సీఎం రేవంత్ అన్నారు. ఆక్రమణలు పెరగడంతో ఖమ్మం వరద ముంపునకు గురైందని అన్నారు. అయితే ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణనష్టం తగ్గిందని అన్నారు. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 75 ఏళ్లలో తొలిసారిగా ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. మున్నేరు ప్రహరీ గోడ ఎత్తు పెంచేందుకు ఇంజినీర్లతో చర్చలు జరుపుతామని సీఎం తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల సహకారంతో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే హరీష్‌పై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వరదలపై హరీష్ అనవసర వ్యాఖ్యలు చేశారన్నారు. కేసీఆర్ కుటుంబం దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయని, సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.2 వేల కోట్ల నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ అన్నారు. విపత్తుపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. వరదల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహను ఆదేశించినట్టు చెప్పారు. మిషన్ కాకతీయలో జరిగిన దోపిడీ వల్లే చెరువు కట్టలు తెగిపోయాయని రేవంత్ ఆరోపించారు.
అమెరికాలో ఉన్న కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. వరదలపై బీఆర్‌ఎస్ నేతలు తల, తోక లేకుండా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. తాను ఫాంహౌస్‌లో పడుకునే వాడిలా కాదు అని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కనీసం కన్నెత్తి కూడా చూడలేదని మండిపడ్డారు. ప్రజలను కాపాడుకునేందుకు కష్టపడుతున్నామని తెలిపారు. కేంద్రం నుంచి సాయం కూడా కోరామని వివరించారు.