సీజ్‌ చేసిన సొత్తు తిరిగివ్వండి.. ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 6:52 AM GMT
election commission,  return seized money, telangana,

సీజ్‌ చేసిన సొత్తు తిరిగివ్వండి.. ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా మరో నెలరోజుల సమయమే ఉంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా.. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు. భారీగా నగదు, నగలు సీజ్‌ చేస్తున్నారు. అయితే.. రాజకీయ నాయకులు, పార్టీలకు చెందిన సొమ్మే కాకుండా.. సామాన్యులకు సంబంధించిన సొత్తు కూడా సీజ్‌ చేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లివెత్తున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. సీజ్‌ చేసిన సొత్తును ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదని తేలితే జిల్లాల్లో గ్రీవెన్స్‌ ఎల్స్ ద్వారా తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తున్నారు. భారీ ఎత్తున బంగారం, డబ్బు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఓలీసులు రూ.350 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీజ్‌ చేసిన సొత్తులో ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదనుకుంటే సదురు యజమానులకు వెంటనే తిరిగి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సీజ్‌ చేసిన సొమ్ము తిరిగి ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఫిర్యాదు వస్తున్నాయని.. అందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

తనిఖీలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. అలాగే త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు చెప్పారు.

Next Story