తెలంగాణలో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. భవిష్యత్తులో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం
Eight Omicron cases in Telangana.తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరిందని రాష్ట్ర ప్రజారోగ్య
By తోట వంశీ కుమార్ Published on 17 Dec 2021 8:13 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి జరగలేదని చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు చెప్పారు. వీరిలో 8 మంది రాష్ట్రంలో ప్రవేశించారని.. మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందినవారన్నారు. అతడు రాష్ట్రంలోకి రాలేదన్నారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఇక ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల ఒక్క మరణమే సంభవించిందని తెలిపారు. మొత్తం 90కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఇక దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు కోరారు. ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలంతా తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఇంటా, బయటా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు.
భవిష్యత్తులో మరో 10 కొత్త కరోనా వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళనలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారన్నారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారని వెల్లడించారు. 56 శాతం మంది రెండు డోసులు వేసుకున్నారని తెలిపారు.