నామా నాగేశ్వరరావుకు చెందిన సంస్థలపై ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు

ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ టోల్ హైవే, మధుకాన్ ఇన్‌ఫ్రా తదితర సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Sept 2024 5:00 PM IST
ED prosecution complaint, firms, Nama Nageswara Rao

బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు మరిన్ని చిక్కులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులకు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ టోల్ హైవే, మధుకాన్ ఇన్‌ఫ్రా తదితర సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ కంపెనీలు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందినవి. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్ (REL) సంస్థ డైరెక్టర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాంచీకి చెందిన అధికారులు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ED దర్యాప్తు చేపట్టింది.

మోసం ఏమిటి?

NHAI, రాంచీ-రార్‌గావ్-జమేష్‌ద్‌పూర్ సెక్షన్‌లో NH-33.. 4-లేనింగ్ ప్రాజెక్ట్‌ను మధుకాన్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి మధుకాన్ గ్రూప్ ద్వారా స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ను చేర్చారు. మధుకాన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్టర్ గా వ్యవహరించింది. పూర్తి రుణ మొత్తాన్ని పొందినప్పటికీ, మధుకాన్ గ్రూప్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేకపోయింది. దీంతో వారి ఒప్పందం రద్దు చేశారు. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.

కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుండి REL 1030 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు ED దర్యాప్తులో తేలింది. అయితే, మధుకాన్ గ్రూప్ రుణ మొత్తాన్ని ఈ ప్రాజెక్టులను పూర్తీ చేయడానికి ఉపయోగించలేదు. దానిని ఇతర పనులలో ఉపయోగించడం కోసం అనుబంధ సంస్థలకు మళ్లించింది. ఇతర పనులకు రుణాన్ని స్వాహా చేసింది.

మొత్తం రుణం తీసుకున్నా కూడా పనులు పూర్తి చేయలేకపోయారు. అధిక ఖర్చులు అయ్యాయంటూ వాదించారు. ఈ గ్రూప్ ఆర్థిక స్థితి చాలా సంవత్సరాలుగా బాగా లేదు. రాంచీ-జంషెడ్‌పూర్ ప్రాజెక్ట్ కోసం టెండర్‌ను గెలుచుకున్న తర్వాత, మధుకాన్ గ్రూప్ రుణ నిధులను రౌండ్ ట్రిప్పింగ్ చేసింది. చివరకు మధుకాన్ గ్రూప్ రుణాలు చెల్లించలేక రుణ ఖాతా ఎన్.పీ.ఏ.గా మారింది.

తీసుకున్న రుణాలు స్వాహా:

ED దర్యాప్తులో మధుకాన్ గ్రూప్ ప్రమోటర్లు మొత్తం EPC కాంట్రాక్టును దాని SPV నుండి తీసుకొని, ఆపై వారి ఇతర ప్రాజెక్ట్‌ల కోసం భారీ మొబిలైజేషన్, మెటీరియల్ అడ్వాన్స్‌లను మళ్లించడం ద్వారా రుణ నిధులను వాడేశారని వెల్లడైంది.

రుణ నిధులను కూడా వారే నియంత్రించగలిగేలా సబ్-కాంట్రాక్టర్లు/షెల్ ఎంటిటీలకు మళ్లించారు. వారి నుండి 75.50 కోట్ల రూపాయల నగదు తిరిగి పొందారు. ఈ సబ్-కాంట్రాక్టర్లు అవసరమైన పని పూర్తీ చేయలేదు. ప్రాజెక్ట్ జార్ఖండ్‌లో ఉంది. మధుకాన్ ప్రాజెక్ట్ నుండి రుణ నిధుల నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకున్నారు. ఆ నిధులను వారి పరికరాలు, కార్మికులను ఉపయోగించారనే సాకుతో మధుకాన్ గ్రూప్‌కు తిరిగి మార్చారు. ఇప్పటి వరకు జరిగిన పీఎంఎల్‌ఏ విచారణలో రూ. 365.78 కోట్ల రుణ నిధుల మళ్లింపు గుర్తించారు.

ఈ కేసులో ఈడీ గతంలో సోదాలు నిర్వహించి నేరారోపణలు చేసే సాక్ష్యాలు, లెక్కలో చూపని రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, వాటి డైరెక్టర్లకు చెందిన రూ.96.21 కోట్ల విలువైన 105 స్థిరాస్తులు, ఇతర ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.

Next Story