అంజనీకుమార్‌పై ఈసీ సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్‌ను భారత ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 12 Dec 2023 11:00 AM ISTఅంజనీకుమార్‌పై ఈసీ సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్‌ను భారత ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో అంజనీకుమార్‌పై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలపై సస్పెండ్ చేసింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అప్పటి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన తర్వాత సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.
పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థిని, స్టార్ క్యాంపెయినర్‌ను డిజిపి తన నివాసంలో పుష్పగుచ్ఛంతో కలిశారనే దురుద్దేశానికి నిదర్శనమని ఈసీ గమనించింది. ఆయన సస్పెన్షన్ నేపథ్యంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ రవిగుప్తా రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. డీజీపీతో పాటు అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్‌లకు కూడా అప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని విజ్ఞప్తిలో పేర్కొన్నారు.