ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్
Eatala Resignation accepted by Speaker.మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అస్లెంబీ స్పీకర్ పోచారం
By తోట వంశీ కుమార్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అస్లెంబీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ ఉదయం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఈటల.. స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఆ రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోద ముద్ర వేశారు.
అంతకముందు రాజీనామా సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగా అని ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. టీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చినా.. గెలిపించింది మాత్రం ప్రజలేనని అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని.. హుజూరాబాద్‌లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటల అన్నారు.
భూఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొన్న ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఈటల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 14న ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన వెంట రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా హస్తిన వెళ్లి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.