తాగుబోతు టీచర్ అరాచకం.. నవ్వారని బాలికలను కొట్టడంతో..
Drunkard teacher thrashes 3 students in Mahabubabad. ఆ ఉపాధ్యాయుడు స్కూల్‌కు మద్యం తాగి వచ్చాడు. తరగతి గదిలో ఆ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఊగుతుండగా
By అంజి Published on 18 Nov 2022 3:10 PM IST
ఆ ఉపాధ్యాయుడు స్కూల్‌కు మద్యం తాగి వచ్చాడు. తరగతి గదిలో ఆ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఊగుతుండగా చూసి ముగ్గురు విద్యార్థినిలు నవ్వుకున్నారు. ఇది గమనించిన సదరు టీచర్ ఆ విద్యార్థినులపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ స్కూల్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ ( ఎస్‌జీటీ ) ముగ్గురు విద్యార్థినులను మద్యం మత్తులో కొట్టడంతో బాధితుల్లో ఒకరు ఆసుపత్రిలో చేరారు.
ఈ సంఘటన మంగళవారం జరిగినప్పటికీ, ఉపాధ్యాయుడిని రక్షించే ప్రయత్నంలో ప్రధానోపాధ్యాయుడితో సహా అధికారులు సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థినులు చూసి నవ్వుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆగ్రహించిన ఉపాధ్యాయుడు 7వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలపై దాడికి పాల్పడ్డాడు. వీరిలో ఒకరికి మెడనొప్పి రావడంతో.. నొప్పి తగ్గుతుందని హెడ్‌మాస్టర్ టాబ్లెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని విద్యార్థిని కోరాడు.
అయితే బాధితురాలు బుధవారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె శశాంక్‌తో పాటు సంబంధిత అధికారులను గురువారం కోరారు. అలాగే విద్యార్థిని పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.