మునుగోడు ఉప ఎన్నిక.. ఓటర్లకు వెంకటేశ్వరస్వామి ప్రత్యేక విన్నపం

Don’t sell vote for note.. Man in Lord Venkateswara swamy getup pleads. ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టడం పరిపాటి.

By అంజి  Published on  30 Oct 2022 4:06 PM IST
మునుగోడు ఉప ఎన్నిక.. ఓటర్లకు వెంకటేశ్వరస్వామి ప్రత్యేక విన్నపం

ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టడం పరిపాటి. ఏ పార్టీ ఎక్కువ నగదు, ఎక్కువ బహుమతులు ఇస్తుందో కూడా ఓటర్లు ఆరా తీస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ముఖ్యమైన ఎన్నిక కావటంతో మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. తమకు ఏ పార్టీ అభ్యర్థి ఎక్కువ డబ్బులు ఇస్తాడో వారి పార్టీలకే జై కొడతామని తెగేసి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్‌కుమార్‌.. ఓట్లను అమ్ముకోవద్దని వేంకటేశ్వర స్వామి వేషధారణతో ప్రజలను అభ్యర్థించారు. మేధావులు, ఎన్నికల అధికారులు, ఇతరులు ఎన్నికల సమయంలో తమ ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలను వేడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. మునుగోడు ఉప ఎన్నిక ముందు వేంకటేశ్వర స్వామి గెటప్‌లో ప్రజల కళ్లు తెరిపించాలని శ్యామ్ కుమార్ భావించారు. రోజుకు రెండు గ్రామాలను ఎంచుకుని ఓట్లు అమ్ముకోవడం వల్ల తలెత్తే సమస్యల గురించి వివరిస్తున్నారు. ఓటును అమ్ముకుంటే ఏ విషయంలోనైనా నాయకులను ప్రశ్నించలేమని ప్రజలకు వివరిస్తున్నారు.

'సమస్యలు ఎవరికీ అంత ఈజీగా రావు, ఓట్లు అమ్ముకుంటేనే వస్తాయి' అనే నినాదంతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ''ఓట్లను అమ్ముకోవద్దని మంచి ఉద్దేశ్యంతో చెప్పినా ఎవరూ వినరు. దేవుడు చెబితే వారు వింటారని నేను ఆశిస్తున్నాను. కనీసం కొంత మంది అయినా దేవుడి ముఖం చూసి డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారని ఆశిస్తున్నా.'' అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్ 1న ప్రచార పర్వానికి తెరపడనుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. 2023 ఎన్నికల ముందు జరగుతున్న ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Next Story