జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

By -  అంజి
Published on : 3 March 2026 3:23 PM IST

Jadcherla Hospital, Mortuary Negligence, Stray Dog Biting Corpse, Telangana Hospital News, Pole Bhimeshwar Case, Hospital Infrastructure Issues, Medical Negligence Telangana

జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి సర్వత్రా ఆగ్రహాన్ని కలిగిస్తోంది. జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనే లారీ డ్రైవర్ శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లారని భావించిన కుటుంబ సభ్యులు, రాత్రి వరకు ఆయన తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం స్థానిక చెరువులో భీమేశ్వర్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించారు. మార్చురీలో సరైన భద్రత లేకపోవడంతో, మృతదేహాన్ని నేలపైనే ఉంచారు. ఆ సమయంలో లోపలికి ప్రవేశించిన ఒక కుక్క, భీమేశ్వర్ మృతదేహాన్ని పీక్కుతినడం మొదలుపెట్టింది. ఈ దృశ్యాలను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ స్పందిస్తూ.. పోస్ట్‌మార్టం సిబ్బంది గదిలోకి వెళ్తున్న సమయంలో కుక్క లోపలికి దూరిందని, వెంటనే దానిని అక్కడి నుండి తరిమివేశామని వివరణ ఇచ్చారు.

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. 2023లో ఈ ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల సౌకర్యానికి అప్‌గ్రేడ్ చేశారు. కొత్త భవనాన్ని నిర్మించినప్పటికీ, మార్చురీకి సంబంధించిన పరికరాలు మరియు మౌలిక సదుపాయాలను మాత్రం ఏర్పాటు చేయలేదు.

పాత భవనంలోనే పోస్ట్‌మార్టం: కొత్త వసతులు లేకపోవడంతో ఇప్పటికీ పాత మార్చురీలోనే పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. ఇటీవల ఒక మృతదేహాన్ని మార్చురీలో ఉంచడానికి బంధువులు నిరాకరించడంతో, రాత్రంతా అంబులెన్స్‌లోనే ఉంచి మరుసటి రోజు ఉదయం పోస్ట్‌మార్టం చేయాల్సి వచ్చింది. ఈ సమస్యల గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

Next Story