తోకతో పుట్టిన చిన్నారి.. తొలగించిన బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్యులు

బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు 3 నెలల మగ శిశువుకు అరుదైన మానవ తోక శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.

By అంజి  Published on  16 July 2024 12:00 PM IST
AIIMS, Bibinagar, human tail Surgery

తోకతో పుట్టిన చిన్నారి.. తొలగించిన బీబీనగర్‌ ఎయిమ్స్‌ వైద్యులు

తెలంగాణ: బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు 3 నెలల మగ శిశువుకు అరుదైన మానవ తోక శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. జనవరిలో శస్త్రచికిత్స జరిగినందున, ప్రక్రియ విజయవంతమైందని ప్రకటించడానికి ముందు వైద్యులు అతడి పరిస్థితిని తనిఖీ చేయడానికి ఏడు నెలల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. శస్త్రచికిత్స తర్వాత ఏడు నెలల తర్వాత, శిశువుకు ఎటువంటి సమస్యలు లేవు. కాబట్టి ఆపరేషన్ విజయవంతమైందని భావించి అరుదైన శస్త్రచికిత్స వివరాలను ప్రకటించారు.

పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ శశాంక్ పాండా తెలిపిన వివరాల ప్రకారం.. తాము అరుదైన మానవ తోక శస్త్ర చికిత్స చేశామన్నారు. ఇది సుమారు 15 సెం.మీ, పిల్లాడి లంబోసాక్రాల్ ప్రాంతంలో ఉందని తెలిపారు. శిశువును పరీక్షించగా వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే తన వైద్యబృందంతో కలిసి శస్త్రచికిత్స చేసి దానిని విజయవంతంగా తొలగించారు. తోక నాడీ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైందని పేర్కొన్నారు. అయితే ఈ తరహా శస్త్రచికిత్సల అనంతరం నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయన్నారు. అయితే ఈ బిడ్డను తాజాగా పరీక్షించగా ఏ విధమైన ఇబ్బంది ఉత్పన్నం కాలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపారు.

అరుదైన కేసులు:

మానవులు తోకలతో జన్మించడం చాలా అరుదు, ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 40 కేసులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. హైదరాబాద్‌లో ఈ కేసు 41వది. ఇటీవలి కాలంలో, చైనాలో మానవ తోక కేసు నమోదైంది, అయితే వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. అయితే ఎయిమ్స్‌లోని వైద్యులు మూడు నెలల బాలుడికి శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. అలాంటి మరొక కేసు 2022లో ఒడిశాలో నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు SUM హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్లు భువనేశ్వర్‌లో అరుదైన శస్త్రచికిత్సలో తోకను తొలగించారు.

Next Story