పిల్లల మీద భోగి పళ్లు ఎందుకు పొస్తారో తెలుసా?

భోగి పండుగ వచ్చిందంటే.. పిల్లల మీద పోసే రేగుపళ్లే గుర్తుకు వస్తాయి. ఈ రోజున రేగు పళ్లు కాస్తా.. భోగి పళ్లుగా మారిపోతాయి.

By అంజి  Published on  14 Jan 2024 5:30 AM GMT
bhogi fruits, childrens, Sankranti festival, plums

పిల్లల మీద భోగి పళ్లు ఎందుకు పొస్తారో తెలుసా?

భోగి పండుగ వచ్చిందంటే.. పిల్లల మీద పోసే రేగుపళ్లే గుర్తుకు వస్తాయి. ఈ రోజున రేగు పళ్లు కాస్తా.. భోగి పళ్లుగా మారిపోతాయి. సాయంత్రం వేళ పెద్దవారందరూ.. గుప్పిటనిండా రేగుపళ్లు, చిల్లర, బంతిపూలు, చెరుకు ముక్కలని తీసుకుని.. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోసి దిష్టి తీయిస్తారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

రేగి పళ్లు దివ్యౌషధం

భోగి పళ్లు (రేగి పళ్లు) ఎందుకు పిల్లలపై పోస్తారో తెలుసుకోవడానికి కంటే ముందు అసలు భోగిపళ్లకు ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకోవాలి. సంక్రాంతి సమయానికి అందుబాటులోకి వచ్చే ఈ పళ్లు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని బతకగలవు. ఈ రేగు పళ్లు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా, సకల ఆరోగ్యాలను అందించే ఔషధి గుణాలతో ఉంటాయి. జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుని అన్ని రకాల రుగ్మతలకి దివ్యౌషధంగా భావిస్తారు.

జ్ఞానం పెరుగుతుందట..

భోగి పళ్లను పిల్లలపై పోయడం వెనుక అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్యకరమైన వివరణలు ఉన్నాయి. ఆధ్యాత్మికం ప్రకారం.. రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అంతేకాకుండా పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. భోగి పండ్లను పోయడం వల్ల తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందట.

ఆనందంతోపాటు.. ఆరోగ్యం

ఆరోగ్య వివరణ ప్రకారం.. సాధారణంగా పిల్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ రేగి పళ్లు పిల్లలపై పోయడం వల్ల వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ఇక రేగుపళ్లతో పాటు బంతిపూలను వాడటం వల్ల.. పిల్లలు చుట్టుపక్కల ఉండేఏ క్రిములన్నీ మాయమైపోతాయి. అలా భోగి పళ్లను పిల్లలపై పోయడం వల్ల.. ఆనందంతోపాటు ఆరోగ్యం లభిస్తుంది.

Next Story