ఈవీఎంల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఒకప్పుడు ఎన్నికలు అంటే.. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు.. కానీ ఇప్పుడు సాంకేతిక పెరగడంతో వాటి స్థానంలోకి ఈవీఎంలు వచ్చి చేరాయి.
By అంజి Published on 20 Nov 2023 8:00 AM GMTఈవీఎంల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఒకప్పుడు ఎన్నికలు అంటే.. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు.. కానీ ఇప్పుడు సాంకేతిక పెరగడంతో వాటి స్థానంలోకి ఈవీఎంలు వచ్చి చేరాయి. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఇవి ఎంతోగానో దోహదపడుతున్నాయి. ఈవీఎం పూర్తి పేరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. 42 ఏళ్ల కిందటే ఈవీఎం అందుబాటులోకి వచ్చినా.. పలు సాంకేతిక సమస్యల వల్ల ఎన్నికల్లో ఉపయోగించలేదు. రాను రాను అన్ని అడ్డంకులు అధిగమించిన ఈవీఎం.. ఆధునికత సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఎన్నికల్లో కీలకంగా మారింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలప్పుడు, మధ్యమధ్యలో ఉపఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈవీఎంలను వాడుతున్నారు.
ఈవీఎంల ప్రస్థానం 1982లో మొదలైంది. కేరళ రాష్ట్రంలోని పరూర్ అసెంబ్లీ స్థానానికి మే 19న జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంను వినియోగించారు. 1982-83లో దేశ వ్యాప్తంగా పది స్థానాల్లో నిర్వహించిన ఉపఎన్నికల్లో ఈవీఎంనే ఉపయోగించారు. 1984లో ఈవీఎంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో మార్చి 5న ఎన్నికల్లో ఈవీఎం వాడకం తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 1988 డిసెంబర్లో.. సెక్షన్ 61-ఏ ద్వారా చట్టంలో చేర్చి ఈవీఎంలను తిరిగి వాడకంలోకి తీసుకొచ్చారు.
1989 మార్చి 15న సుప్రీంకోర్టు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు మద్దతు ప్రకటించింది. ఎన్నికల సంస్కరణ కమిటీ ఆదేశాల మేరకు 1990 జనవరిలో.. సాంకేతిక నిపుణుల కమిటీ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించుకోమని సిఫారసు చేసింది. మార్చి 24న 1992న పలు సవరణలతో.. ఎన్నికల నియామావళి 1981లో ప్రభుత్వం అధీకృతం చేసింది. 1998లో ప్రజామోదం లభించింది. 1999 నుంచి 2018 మధ్య కాలంలో చట్ట సభలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎం సేవలను వినియోగించుకున్నారు.
ఈవీఎంలో మొత్తం రెండు యూనిట్లు ఉంటాయి. మొదటిది కంట్రోల్ యూనిట్ కాగా రెండోది బ్యాలెటింగ్ యూనిట్ అని అంటారు. మీ కళ్లకు కనిపించే బ్యాలెట్ యూనిట్‌లో నోటాతో కలిపి 16 మీటలు ఉంటాయి. వీటిల్లో 15 మీటలు నాయకుల భవితను నిర్ణయిస్తాయి. పోలింగ్ పూర్తైన తర్వాత ఈవీఎంను జాగ్రత్తగా తీసుకెళ్లి ఒక చోట భద్రంగా ఉంచుతారు. దాన్నే స్ట్రాంగ్ రూమ్ అని అంటారు. లెక్కింపు పూర్తయ్యేదాక ఈవీఎంను కంటికి రెప్పలా కాపాడుతారు.
ఈవీఎం బ్యాటరీ ఆధారంగా పని చేస్తుంది. ఎం-2గా పిలిచే ఈవీఎంలో ఆరు ఓల్ట్ల సామర్థ్యం కలిగిన ఆల్కలైన్ పవర్ ప్యాక్ బ్యాటరీని ఉపయోగించారు. ప్రస్తుతం ఎం-3గా పిలిచే ఈవీఎంలో 7.5 ఓల్ట్ల సామర్థ్యంతో కూడిన ఆల్కలైన్ పవర్ ప్యాక్ బ్యాటరీని అమర్చారు. కరెంట్ సరఫరా నిలిచినా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. 1980లో హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు ఈవీఎంలకు పురుడు పోశారు.