బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

తాజాగా గద్వాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  24 Aug 2023 10:52 AM GMT
Disqualification, BRS MLA, Telangana,

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

ఇటీవల ప్రజాప్రతినిధులపై అర్హత పిటిషన్లు విచారణకు వస్తున్న సందర్భంగా ఆయా నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరిన్ని పిటిషన్లపై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరుపుతోంది. మహబూబ్‌నగర్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలు చేసింది కోర్టు. అయితే తాజాగా గద్వాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది.

2018 ఎన్నికల సమయంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఆ పిటిషన్‌ను ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని డీకే అరుణ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు డీకే అరుణ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత.. కృష్ణ మోహన్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని నిర్ధారించింది. దాంతో.. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం.. కృష్ణ మోహన్‌రెడ్డి రూ.2.5 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక పిటిషనర్ డీకే అరుణకు పిటిషన్‌ ఖర్చుల కోసం రూ.50వేలు చెల్లించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. గతంలో అనర్హత వేటును ఎదుర్కొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. సుప్రీంకోర్టును ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story