హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని.. బీఆర్‌ఎస్ సభ్యులు శాసించినట్టు సభ నడవాలంటే కుదరదని, నిబంధనల ప్రకారమే అందరూ నడుచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సభలో నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ హంగామా చేయడం సరికాదన్నారు. బీఏసీ సమావేశంలో స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అవమానించి.. పేపర్లు పడేసి వెళ్లిపోయారని ఆగ్రహించారు. స్పీకర్ అంటే బీఆర్‌ఎస్ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర అప్పులపై మరోసారి చర్చ పెట్టాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విసిరిన సవాల్‌ను.. డిప్యూటీ సీఎం భట్టి స్వీకరించారు. రుణాలపై చర్చలకు స్పీకర్ అంగీకారంతో స్పెషల్ సెషన్ పెడతామంటూ వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్ పెట్టామని హరీశ్ రావు పేర్కొనగా.. ప్రివిలేజ్ మోషన్ పెట్టే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు నిజాలు చెప్పే అలవాటు లేదని.. సభలో ఆయన మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
హరీశ్ రావు వెనుక కూర్చొని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం అలానే తయారయ్యారని వ్యాఖ్యానించారు. అప్పులపై శ్వేతపత్రం గతంలోనే విడుదల చేశామని.. మళ్లీ బీఆర్‌ఎస్ సభ్యులు కోరుకుంటే, మరోసారి చర్చ పెడతామని భట్టి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో దాదాపు రూ.45 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. సివిల్ సప్లైస్‌లో రూ.18 వేల కోట్ల బకాయిలు పెట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక.. రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లుల్లో రూ.20 వేల కోట్లను క్లియర్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతిగింజ ధాన్యాన్ని కొంటున్నామని, రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు.