వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని బీఆర్‌ఎస్ నాయకుడు అబ్రార్ లాలా పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అబ్రార్ లాలా బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన ఫయాజ్‌ని ఆహ్వానించేందుకు డీజే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు స్వాగతం పలికేందుకు మంగళవారం రాత్రి పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా నుంచి ఇందిరాచౌక్ వైపు ర్యాలీ తీస్తుండగా డీజే వాహనానికి అమర్చిన జనరేటర్ కింద ఇంద్ర నగర్ కు చెందిన (14 ) బాలుడు రెహాన్ పడ్డాడు. స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమాదవశాత్తు వేడుకల్లో సౌండ్ బాక్స్‌లను ఉపయోగిస్తున్న ట్రాక్టర్‌కు అటాచ్‌గా ఉన్న జనరేటర్ ట్రాలీ బాలుడి మీద పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలుని పరిస్థితి విషమంగా ఉందని వైద్య సిబ్బంది నిర్ధారించారు. వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అనుమతి లేకుండా డీజే తో ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించామని తాండూర్ డీఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు.