తెలంగాణ కాంగ్రెస్‌లో అన్ని సమస్యలు సర్దుకున్నాయని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని.. ఆ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ వద్ద దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో విభేదాలపై నాయకులు ఎవరూ బహిరంగా మాట్లాడొద్దన్నారు. త్వరలోనే అన్నీ సమస్యలను పరిష్కారం దొరుకుతుందన్నారు. కలిసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమన్న ఆయన.. పార్టీ లైన్‌కు నేతలు కట్టుబడి ఉండాలని సూచించారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హితవు పలికారు.
ఏ సమస్యపైనైనా అంతర్గతంగా చర్చించాలని పార్టీ నేతలకు చేతులు జోడించి కోరుతున్నానని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. 'మీకు దండం పెడతా.. కొట్లాడొద్దు' అంటూ సీనియర్లకు దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, దీన్ని పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీనియర్ నేతలంతా సంయమనం పాటించాలని, ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని కోరాఉ. దిగ్విజయ్ సింగ్ తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ఆల్ సెటిల్డ్.. నో ప్రాబ్లమ్ అని చెప్పారు.
పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే ప్రస్తావన సరికాదన్నారు. పీసీసీ చీఫ్, ఇంచార్జీ మార్పు తన పరిధిలోని అంశం కాదన్నారు. ఐక్యమత్యంగా ఉంటనే ప్రత్యర్థులపై పోరాడగలమన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి సమస్యలు అక్కడ రాలేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అని ప్రశ్నించారు. 2004లో ఇచ్చిన మాట ప్రకారం 2014లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రచారం చేశారని అన్నారు.