హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేశుడి నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయం నుంచి ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గణపయ్యల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
కీలక ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ జరుగుతుందన్నారు. పోలీసు స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పది అడుగుల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు, పది అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.