అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్‌

Deputy Tehsildar arrested for breaking into IAS Smita Sabharwal's house at midnight. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ గల మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ

By అంజి  Published on  22 Jan 2023 6:12 AM GMT
అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్‌

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ గల మహిళా ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ మేడ్చల్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌ కుమార్‌ రెడ్డి చొరబడిన ఘటన కలకలం రేపింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారిణి స్మితా సభర్వాల్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అధికారిణి ట్వీట్లకు డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ రెడ్డి ఒకట్రెండు సార్లు రీట్వీట్లు చేశాడు.

రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో డిప్యూటీ తహసీల్దార్‌ తన ఫ్రెండ్‌ అయిన ఓ హోటల్‌ యజమానితో కలిసి ఐఏఎస్‌ అధికారిణి ఉంటున్న గేటెడ్‌ కమ్యూనిటీకి వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి తాను పలానా వ్యక్తిని కలవాలని చెప్పడంతో వారు కమ్యూనిటీ లోపలికి అనుమతించారు. ఆ తర్వాత స్నేహితుడిని కారులోనే ఉండమని చెప్పిన డిప్యూటీ తహసీల్దార్‌.. అధికారిణి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన అధికారిణి.. అర్ధరాత్రి పూట తన నివాసానికి అపరిచిత వ్యక్తి రావడంపై ఆమె షాక్‌కు గురయ్యారు.

వెంటనే తేరుకున్న అధికారిణి.. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావని అతడిని ప్రశ్నించారు. స్పందించిన అతడు.. తాను డిప్యూటీ తహసీల్దార్‌నని, గతంలో మీకు ట్వీట్‌ చేశానని, తన విధుల విషయంలో ఇబ్బందులున్నాయని ఐఎఎస్ అధికారికి చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. తక్షణం ఇక్కడి నుంచి వెళ్లాలని చెబుతూ కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఆనంద్‌కుమార్‌ రెడ్డి ప్రస్తుతం సివిల్‌ సప్లైస్‌లో డిప్యూటేషన్‌పై ఉన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఐఎఎస్ స్మితా సభర్వాల్

తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు. '' నాకు అత్యంత బాధాకరమైన అనుభవం కలిగింది. ఒక రాత్రి నా ఇంట్లోకి చొరబాటుదారుడు చొరబడ్డాడు. నాకు నేను రక్షించుకోవడంపై దృష్టి పెట్టాను. మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారని మీరు భావించినా, ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా తలుపులు/తాళాలను తనిఖీ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో #100 డయల్ చేయండి'' అంటూ స్మితా సభర్వాల్‌ ట్వీట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని ఐఏఎస్‌ అధికారి నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు డిప్యూటీ తహశీల్దార్‌, అతని స్నేహితుడు వచ్చారు. అతని స్నేహితుడు కారులో వేచి ఉండగా, తహశీల్దార్ ఐఎఎస్ అధికారి ఇంటి నంబర్‌ను సెక్యూరిటీకి చెప్పి ముందుకు సాగారు. అతను తలుపు తట్టాడు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అంటూ.. ఐఎఎస్ అధికారి అతన్ని ప్రశ్నించారు. తన ఉద్యోగానికి సంబంధించి మాట్లాడాలని అన్నారు. ఆమె సెక్యూరిటీని అప్రమత్తం చేసి పరిస్థితి నుండి తనను తాను రక్షించుకున్నారు.


Next Story