తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వారికి ఏప్రిల్ నుంచి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.600 కోట్ల చొప్పున రూ.8 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు. ఉద్యోగులు బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు.
బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ జేఏసీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్స్ పెండింగ్ లో పెట్టి వెళ్లిందని తెలిపారు. గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని భట్టి వివరించారు. పాత, కొత్త కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు పదివేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించిందన్నారు.
మిగిలి ఉన్న పెండింగ్ బిల్లులను రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన చెల్లిస్తామని తెలిపారు. గత పదేండ్లలో ప్రభుత్వ ఉద్యోగులు పడ్డ కష్టాన్ని పాదయాత్రలో స్వయంగా చూశానని.. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని తెలిపారు.