Delhi Liquor Scam: కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అప్రూవర్‌గా వైసీపీ ఎంపీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో YSRCP ఒంగోలు ఎంపీ అప్రూవర్‌గా మారారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sept 2023 3:37 PM IST
Delhi Liquor Scam, MLC Kavitha, YCP MP, Magunta Srinivasulureddy

Delhi Liquor Scam: కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అప్రూవర్‌గా వైసీపీ ఎంపీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో YSRCP ఒంగోలు ఎంపీ అప్రూవర్‌గా మారారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది. ఈ కేసులో సౌత్‌గ్రూప్‌ నుంచి రూ.100 కోట్లను దిల్లీ ఆప్‌ నేతలకు అందించి దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేసుకున్నట్లు సీబీఐ, ఈడీలు ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జిషీట్లలో పేర్కొన్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్‌లను ఈడీ అరెస్టు చేయగా.. వారిద్దరూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇందులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఇప్పుడు ఇదే కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌గా మారడంతో బీఆర్ఎస్ MLC, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, కల్వకుంట్ల కవితారావు చుట్టూ ఉచ్చు బిగుస్తూ ఉంది. ఈ కేసులో దినేష్ అరోరా కూడా ఇప్పటికే అప్రూవర్ గా మారిపోయారు.

వైసీపీతో సంబంధం ఉన్న నేతలు అప్రూవర్ గా మారడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు జగన్‌ మోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులు. ఈ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కవితను పలుమార్లు ప్రశ్నించాయి. తాజాగా మరోసారి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుల్లో ఒకరైన, ‘సౌత్ గ్రూప్’లో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన పీ శరత్ చంద్రారెడ్డిని ఏపీ ప్రభుత్వం ఇటీవలే టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించింది.

టీటీడీ బోర్డు జాబితాలో ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐ మాజీ అధ్యక్షుడు, గుజరాత్ నివాసి డాక్టర్ కేతన్ దేశాయ్ ఉన్నారు. దేశాయ్‌ను బోర్డు సభ్యుడిగా నియమించడం ఇది రెండోసారి. 2021లో, టీటీడీ బోర్డులో మొదటి గుజరాతీ ఆయనే..! డా.కేతన్ దేశాయ్ ప్రస్తుతం గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. పి.శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ బెయిల్‌పై బయట ఉండగా, ఎమ్మెల్సీ కవిత సన్నిహితులు, హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినప్లె అభిషేక్‌రావు ఇంకా జైలులోనే ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం ఆమ్ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో సహా మూడు రాజకీయ పార్టీలను కుదిపేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీని కాపాడుకోవడం కోసం.. వైసీపీకి చెందిన నేతలు ముగ్గురు అప్రూవర్లుగా మారారని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పుడు కార్నర్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సుదీర్ఘ విచారణ తర్వాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారడంతో విచారణ వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వ్యాపారవేత్త అమన్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవినీతి అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే..!

Next Story