Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ

ఎమ్మెల్సీ కే కవిత చేసిన పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో కేవియట్ దరఖాస్తు దాఖలు చేసింది.

By అంజి  Published on  19 March 2023 5:15 AM GMT
Delhi Liquor Scam, Supreme Court, MLC Kavitha

ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తనపై దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కే కవిత చేసిన పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో కేవియట్ దరఖాస్తు దాఖలు చేసింది. ఒక వ్యాజ్యం వినకుండా తమకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయబడకుండా చూసుకోవడానికి ఒక కేవియట్ అప్లికేషన్‌ను ఈడీ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం.. ఓ మహిళను ఈడీ ముందు విచారణకు పిలవలేరని, ఆమె నివాసంలోనే విచారణ జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు సుప్రీంకోర్టు మార్చి 15న అంగీకరించింది. మార్చి 16న మళ్లీ తన ఎదుట హాజరుకావాలని ఈడీ ఎమ్మెల్సీని కోరింది. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ ఆమె హాజరుకాలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆమె పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఇప్పుడు ఒక మహిళను ఈడీ విచారణ కోసం పిలుస్తోందని, ఇది "పూర్తిగా చట్ట వ్యతిరేకం" అని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కవిత తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు. ఆమె పిటిషన్లపై అత్యవసర విచారణను కోరారు. మార్చి 24న జాబితా చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ విషయంలో అత్యవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించగా, రేపు ఈడీ ఎదుట హాజరు కావాలని కవితను కోరినట్లు న్యాయవాది బదులిచ్చారు.

న్యాయవాది వందనా సెహగల్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో.. కవిత మార్చి 7, 11 తేదీలలోని ఈడీ సమన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. తన నివాసానికి బదులుగా ఏజెన్సీ కార్యాలయం ముందు హాజరు కావాలని కోరడం నేర న్యాయశాస్త్రం, సిద్ధాంతాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఆమె మార్చి 11, 2023 నాటి జప్తు ఉత్తర్వులను పక్కన పెట్టాలని, దాని కింద చేసిన నిర్భందాన్ని రద్దు చేయాలని కోరింది. పిటిషనర్‌ కవిత పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయినా, కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార రాజకీయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో, ఆ ఎఫ్‌ఐఆర్‌తో ముడిపెట్టి అపకీర్తికి గురిచేస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

Next Story