ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఆశించిన బీఆర్ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జూడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికారులు.
దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన 8 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20వ తేదీన విచారణ చేపడతామని జడ్జి చెప్పారు. కాగా ఇప్పటికే సీబీఐ కేసులో కవితకు కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.