నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ క‌విత‌.. మద్దతుగా ఢిల్లీలో వెలిసిన ఫ్లెక్సీలు

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో శ‌నివారం ఈడీ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు ఎమ్మెల్సీ క‌విత‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 3:44 AM GMT
Delhi liquor policy case, MLC Kavitha

ఎమ్మెల్సీ క‌విత‌

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచార‌ణ‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హాజ‌రుకానున్నారు. క‌విత‌ను విచారించ‌నున్న నేప‌థ్యంలో ఢిల్లీలోని ఈడీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద భ‌ద్ర‌త‌ను పెంచారు.

అటు కవిత విచారణ వేళ భారీ ట్విస్ట్‌ నెలకొంది. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో శుక్ర‌వారం రామచంద్ర పిళ్లై పిటిషన్‌ దాఖలు చేశారు. ట్విస్టుల మీద ట్విస్టుల మధ్య ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. సౌత్‌ గ్రూపు లావాదేవీలు, ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపై లోతుగా విచారించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్ప‌టికే ఈ కేసులో ఓ సారి క‌విత‌ను ఈడీ ప్ర‌శ్నించింది.

క‌విత‌కు మ‌ద్ద‌తుగా హోర్డింగ్‌లు..

మరోవైపు కవితకు మద్దతుగా ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వ‌ద్ద‌కు త‌ర‌లివ‌స్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం కవితకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.

Next Story