తెలంగాణలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండదట.. కానీ..!

CS Somesh Kumar About Lockdown in Telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించబోవడం లేదని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on  5 May 2021 6:26 PM IST
CS Somesh Kumar

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఆయుధంగా మలచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ను విధించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూ ఉండగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించబోవడం లేదని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. వారాంతపు లాక్‌డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నామన్నారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని.. లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే, వారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు. తెలంగాణరాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో లాక్ డౌన్ ను విధించడం.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలని అన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారని అన్నారు.

హైదరాబాద్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ క్యాపిటల్‌ కావడంతో ఇతర రాష్ట్రాల వారు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారని అన్నారు. తెలంగాణలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదని అన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్‌ ఉన్నాయని.. తెలంగాణలో 135 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుండగా.. ఎయిర్‌లిఫ్ట్‌ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోందన్నారు. తెలంగాణలో 90వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. అనవసరంగా ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌ మందుల్ని వృథా చేస్తున్నారని తెలిపారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చు చేయడానికైనా తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని.. అవసరమైతే లాక్ డౌన్ విధించే నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటారని అన్నారు.


Next Story