కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు చెప్పారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), ఆర్ఎస్పీ, సీపీఐ (ఎంఎల్ – లిబరేషన్) తదితర పార్టీల నాయకుల ప్రతినిధి బృందం సీఎంని సచివాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదన్న విషయాన్ని గుర్తుచేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. భూ సేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో పాటు ఇతర నాయకులు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు.