మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల వాసులను చిరుతపులి వణికిస్తోంది. చౌదరపల్లి గుట్టల్లో ఆదివారం మరో పశువుపై దాడి చేసింది. వరుసగా మూడు రోజుల్లో పలు గ్రామాల్లోని పశువులపై దాడులు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్న వెంకటాయపల్లిలో, నిన్న నాగారం గ్రామంలో పశువులపై దాడి చేసిన చిరుత తాజాగా ఆదివారం చౌదరపల్లి గ్రామంలోని గుట్టల్లో లేగదూడను చంపేసింది.
నాగారంలో చిరుతల పాదముద్రలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముచ్చింతల్‌లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని స్థానికులు చెపుతున్నారు. అయితే, ఒకటే చిరుత ఆయా గ్రామాల్లో దాడులు చేస్తుందా.. లేదంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా అనేది తెలియడం లేదు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి.. తమను వాటి బారి నుంచి కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.