పాఠశాలలో కరోనా కలకలం..!
Covid-19 tension in schools.కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు మూతపడిన పాఠశాలలు
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2021 3:38 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు మూతపడిన పాఠశాలలు ఇటీవలే తెరచుకున్నాయి. పాఠశాలలు తెరచుకోవడంతో విద్యార్థులు ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై మూడు రోజులే అయినప్పటికి కరోనా భయం వెంటాడుతోంది. తెలంగాణలోని పాఠశాలలో అప్పుడే కరోనా కలవరం మొదలైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా సోకింది. దీంతో విద్యార్థులందరికి పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు ఆ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఇక ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. మిగతా ఉపాధ్యాయులు పరీక్ష చేయించుకోగా.. వారికి నెగిటివ్‌గా వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ పాఠశాలలోనూ ఓ విద్యార్థిని, అటెండర్‌కు కరోనా సోకింది. విద్యార్థిని తండ్రికి కూడా పాజిటివ్ అని తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పాఠశాలలోని 75 మందికి కొవిడ్ పరీక్షలు చేయించారు.
అటు ఏపీలోని పాఠశాలల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కురబలకోట మండలంలోని ఓపాఠశాలలో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు ఎస్టీ గురుకుల పాఠశాలలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక ఉపాధ్యాయుడితోపాటు ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. భయం భయంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతున్న వేళ.. కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.