ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు..!

Court Shock To MP And MLA. అనుమతి లేకుండా వసతిగృహం ప్రారంభించారన్న వివాదంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది

By Medi Samrat  Published on  6 March 2021 5:30 AM GMT
Court Shock To MP And MLA

అనుమతి లేకుండా వసతిగృహం ప్రారంభించారన్న వివాదంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య సహా 13 మందికి 4,200 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించకపోతే నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. నల్గొండలో 2015లో ఎస్సీ, ఎస్టీ వసతి గృహంతో పాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

అయినప్పటికీ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత తెరాస ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి నల్గొండలో ఐదు కేసులు నమోదయ్యాయి. నిన్న నాలుగు కేసులను కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఇవాళ మరో కేసులో తీర్పు వెల్లడించింది.

చట్టవిరుద్ధంగా గుమిగూడటం, అక్రమ చొరబడి, న్యూసెన్సు సృష్టించారన్న అభియోగాలు రుజువు కావడం వల్ల కోమటిరెడ్డి, చిరుమర్తి తదితరులను దోషిగా తేల్చింది. రూ.4,200 చొప్పున జరిమానా విధించింది.అనుమతి లేకుండా మాజీ శాసనసభ్యుడు ప్రేం సింగ్ రాఠోడ్.. ఎన్నికల ప్రచారం నిర్వహించారని హైదరాబాద్ లోని షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తగిన ఆధారాలు లేకపోవడం వల్ల ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.


Next Story