తెలంగాణలో 925 మందికి కరోనా టెస్టులు.. ఆరుగురికి పాజిటివ్

తెలంగాణలో కూడా కరోనా కేసులు మెల్లి మెల్లిగా పెరుగూతూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  21 Dec 2023 8:47 PM IST
corona,  telangana, health bulletin,

తెలంగాణలో 925 మందికి కరోనా టెస్టులు.. ఆరుగురికి పాజిటివ్

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దాని ప్రభావంతో దేశ ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. వివిధ దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. కరోనా తగ్గుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. వివిధ వేరియంట్ల రూపంలో అలజడి సృష్టిస్తోంది. ఇటీవల కేరళలో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఇక తెలంగాణలో కూడా కరోనా కేసులు మెల్లి మెల్లిగా పెరుగూతూనే ఉన్నాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ రేటు మెల్లిగా పెరుగుతోంది. బుధవారం వరకు కరోనా కేసుల సంఖ్య 14గా ఉండగా.. మరో ఆరు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దాంతో.. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20కి చేరింది. కోవిడ్‌ నుంచి కేవలం ఒకరు మాత్రమే రికరవీ అవ్వగా.. మరో 19 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే.. ఈ కేసుల్లో నాలుగు హైదరాబాద్‌లోనే పాజిటివ్‌ అవ్వగా.. మెదక్‌లో ఒక కరోనా కేసు, రంగారెడ్డిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఇవాళ ఒక్కరోజు 925 మందికి కరోనా టెస్టులు చేశారు వైద్యులు. ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. మరో 54 మందికి కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

మరోవైపు కరోనా కేసులు మెల్లిగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా బాధితుల చికిత్సకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆయా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువగా అవుతున్న నేపథ్యంలో మరింత అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.



Next Story