షర్మిల మొదటి బహిరంగ సభ.. కరోనా పొంచి ఉందే..!
Sharmila public meeting.తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయాలని.. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ
By తోట వంశీ కుమార్ Published on 6 April 2021 10:11 AM GMTతెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయాలని.. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళికలతో ఉన్నారు వైఎస్ షర్మిల. మొదట లక్ష మందితో ఈ సభను నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తూ ఉండడంతో ఈ సభ సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు షర్మిల వర్గంలో మొదలైంది. ఓ వైపు సభ నిర్వహణకు అనుమతి వచ్చినా.. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా సభకు అంత మంది ప్రజలు వస్తారా..? వచ్చినా కోవిద్ నియమాలను పాటిస్తారా అన్నది ప్రశ్నార్థకమే..!
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది. దీంతో పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చారు. ఈ సంకల్పసభను విజయవంతం చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం లో ఆమె పాలేరు నియోజకవర్గానికి చెందిన యెనికే కిషోర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన సంకల్ప సభ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తమ పార్టీ విధి విధానాలను ఆవిష్కరించే ఈ సభకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ సభను కరోనా నిబంధనలకు అనుగుణంగా జరుపుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని షర్మిల కోరారు.