కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామంలో 20 మందికి కరోనా సోకింది. ఒకే గ్రామంలో ఇంత మందికి కరోనా సోకడం భయాందోళన వ్యక్తం అవుతోంది. దీంతో గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రాగా, సుభాష్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కర్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాలల్లో మిగతా వారికి కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కూడా కరీంనగర్‌లో కరోనా కేసులు కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఒకేసారి పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
కాగా, ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయాయి. గతంలో నమోదైనట్లు ఇప్పుడు పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. ఒకప్పుడు 2వేల వరకు కేసులు నమోదు కాగా, రానురాను కేసుల సంఖ్య తగ్గిపోయాయి. తాజాగా ప్రతి రోజు 100 నుంచి 150 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా కట్టడికి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు.. ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.