మునుగోడు నియోజకవర్గంలోని చండూరు పట్టణంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా చండూరు పట్టణమంతా పోస్టర్లు వెలిశాయి. Contract Pe అంటూ రూ. 18000 కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందని ఉన్న పోస్టర్లు రాత్రికి రాత్రే పట్టణంలోని షాపులు, గోడలకు అతికించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టర్లను ఎవరు అతికించారు అనేది తెలియరాలేదు. అయితే.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం మాత్రం టీఆర్ఎస్ నేతలు అంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. నిన్న(సోమవారం) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించగా.. టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు.