సాగర్ ఉపఎన్నిక : నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధులు
Sagar By-Poll Elections. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థులు నామినేషన్ సమర్పించారు
By Medi Samrat
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. భగత్ నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో.. ఎటువంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.
ఉప ఎన్నిక పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. నామినేషన్ వేసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఓటరుకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. భారత దేశంలోనే ప్రయోగాత్మకంగా నామినేషన్స్ వేసి ప్రచారాలకు పోకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ముందుకు వస్తే తమ పార్టీని ఒప్పిస్తానని సవాల్ విసిరారు.
ఇదిలావుంటే.. సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు గడువు కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇక ఈనెల 31న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఏప్రిల్ 3 నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా.. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్, మే 2న ఫలితం వెల్లడికానుంది.