టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారు.. కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు.
By Srikanth Gundamalla
టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారు.. కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. దాంతో.. ఇప్పటికే టికెట్ దక్కిన ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తాము ఈసారి గెలిస్తే ఏం చేస్తామో చెబుతూనే.. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే..అధిష్టానం నుంచి ఒకసారి టికెట్ వచ్చాక ఆ అభ్యర్థి ఎంతో సంతోష పడతాడు. ఇప్పటికే ప్రచారం చేస్తున్నాడు. కానీ.. ఉన్నట్లుండి అధిష్టానం అదే నియోజకవర్గ టికెట్‌ను మరొకరికి కేటాయించింది. ఈ సంఘటన తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగింది.
ఓ వైపు బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. టికెట్ల కేటాయింపు కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ లో కన్ప్యూజన్ కొనసాగుతున్నట్లు వనపర్తి నియోజకవర్గ పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. వనపర్తి నుంచి పోటీ చేసేందుకు చెన్నారెడ్డి, మేఘారెడ్డి ఇద్దరూ విజ్ఞప్తి చేశారు. అయితే.. మొదట కాంగ్రెస్ టికెట్ చెన్నారెడ్డి దక్కింది. ఫస్ట్ లిస్ట్‌లోనే ఆయన పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో.. ఆయన నియోజకవర్గంలో కలియతిరుగుతూ తన గెలుపునకు బాటలు వేసుకోవడం మొదలుపెట్టారు. ప్రచారంలో రెగ్యులర్‌గా పాల్గొంటూ ప్రజలకు విన్నవించుకుంటున్నారు. నామినేషన్ కూడా వేసేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఆయనకు కాంగ్రెస్ అనుకోని షాక్ ఇచ్చింది.
సోమవారం రాత్రి కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జాబితాలో వనపర్తి నియోజకవర్గానికి చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డి పేరుని ఇచ్చారు. అంటే చెన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకున్నట్లు అర్థం అవుతోంది. దాంతో.. ఆ టికెట్ మేఘారెడ్డికి కేటాయించింనట్లు అయ్యింది. ఇలా ముందు తనకు టికెట్ ఇచ్చి.. మళ్లీ వెనక్కి తీసుకోవడంతో చెన్నారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అధిష్టానం వ్యవహారంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ ముందు కూర్చొని చెన్నారెడ్డికి మద్దతు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే చెన్నారెడ్డికే వనపర్తి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
కాగా.. కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తామన్న హామీతోనే చెన్నారెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎన్నికల కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. హామీ మేరకు మొదట ఆయనకే టికెట్ కేటాయించిన కాంగ్రెస్ ఏమయ్యిందో తెలీదు వెనక్కితగ్గింది. తాజాగా వనపర్తి టికెట్ మెఘారెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించింది.