కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2024 7:01 AM IST
congress,  dharmapuri srinivas, death,

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.కాగా.. డీఎస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందనీ.. దాంతో ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో ఉన్నారు. అంచలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో 2004, 2009లో అధికారంలో కాంగ్రెస్‌ ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా పని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్‌లో చేరిన డీఎస్.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి చేరారు. ధర్మపురి శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడే ధర్మపురి అర్వింద్. ఆయన ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్దకుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పని చేశారు.

ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కాలేజ్‌ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి బరిలోకి దిగారు. నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.

Next Story