రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఎన్ని కోట్ల ఆస్తులు, అప్పులు ఉన్నాయంటే?
తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి (67) తన నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు.
By - అంజి |
రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఎన్ని కోట్ల ఆస్తులు, అప్పులు ఉన్నాయంటే?
తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి (67) తన నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనపై ఎటువంటి పెండింగ్ కేసులు లేవని ఈ సందర్భంగా ఆయన డిక్లేర్ చేశారు. నరేందర్ రెడ్డి మరియు ఆయన భార్యకు అస్త్ర కృష్ణ హాస్పిటాలిటీ గ్రూప్‌లో 40 శాతం వాటాలు ఉన్నాయి. వీరికి రూ. 28 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. నరేందర్ రెడ్డి పేరిట రూ. 42.57 కోట్లు, ఆయన భార్య పేరిట రూ. 2,27,06,614 ఆస్తులు ఉన్నాయి. నరేందర్ రెడ్డికి రూ. 24.79 కోట్లు, ఆయన భార్యకు రూ. 1.38 కోట్ల మేర బ్యాంకు రుణాలు ఉన్నాయి. వేం నరేందర్ రెడ్డి వరంగల్‌లోని సీకేఎం (CKM) కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
రాజకీయ నేపథ్యం
నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రికి సలహాదారుగా (ప్రజా వ్యవహారాలు) కొనసాగుతున్నారు. 2004లో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010లో వరంగల్ పశ్చిమ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. 2015లో శాసనసభ (MLC) ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన, అక్టోబర్ 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2021లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయకర్తగా కీలక పాత్ర పోషించారు. మార్చి 4, 2026న కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.
గత వివాదాలు:
2015లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపించింది. అప్పట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసిన సమయంలో, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు లంచం ఇవ్వజూపుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి (అప్పటి టీడీపీ నేత) రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.