సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్ లో ఖర్గేతో బహిరంగ సభ కోసం ఆహ్వానించాలని ఢిల్లీకి పోతున్నామని తెలిపారు. ఈరోజు సీఎం, దీపాదాస్ మున్షి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ బీజేపీతో లోపాయకారి ఒప్పందం కోసం ఢిల్లీ పోయిండని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు తమకున్న అభిప్రాయాలను తెలియజేశారు.. ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలను తాము నివృత్తి చేశామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశామన్నారు. అధికారిక డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో ఉంచాం.. బీసీ సంఘాలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయన్నారు. రెండు మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ఉంటుందని తెలిపారు. మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక పరిస్థితులపై, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. వర్గీకరణ, కులగణనను విసృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు, డీసీసీలకు దిశా నిర్దేశం చేశామని తెలిపారు.