'ఆ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే కేసీఆరే కారణం'

Congress MP Komatireddy Venkat Reddy's criticism of GO 246. జీవో 246.. నల్గొండ రైతులకు తీవ్ర నష్టం కల్గించేలా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి

By అంజి  Published on  29 Aug 2022 2:32 AM GMT
ఆ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే కేసీఆరే కారణం

జీవో 246.. నల్గొండ రైతులకు తీవ్ర నష్టం కల్గించేలా ఉందని, దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే దీక్షకు దిగుతానని హెచ్చరించారు. నల్గొండ జిల్లా ప్రజలకు నష్టం కలిగించే విధంగా సీఎం కేసీఆర్‌ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఎల్బీసీకి కేటాయించబడిన నీటిని రద్దు చేస్తూ సర్కార్‌ జీవో విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లా ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం కలగజేస్తుందని పేర్కొన్నారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం.. నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు కేటాయింపులు జరిగాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా నల్గొండ జిల్లా రైతులకు అన్యాయం చేస్తోందని వెంకట్‌ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే అని కామెంట్‌ చేశారు.

నల్గొండలో ఫ్లోరైడ్ రూపుమాపింది తామేనని, ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల కెనాల్స్ బాగున్నాయని అన్నారు. తమ దగ్గర కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిందని, బాగు చేయడంలో సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని వెంకట్ రెడ్డి ఆరోపించారు. జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. జీవో రద్దు చేయాలనీ సీఎం కేసీఆర్‌కు లెటర్‌ రాస్తానన్నారు. అవసరమైతే కేసీఆర్‌ అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానని చెప్పారు. ఎస్ఎల్బీసీ 30 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించాలని అన్నారు.

Next Story