పెద్దపల్లి జిల్లా మంథనిలో రాజకీయం హీటెక్కింది. మంగళవారం రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా.. బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్న కు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంథనిలో శాంతియుత ఎన్నికల నిర్వహణకై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. బక్కన్న అనే వ్యక్తి ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకంతో ఒక గ్రామ సర్పంచిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి అని.. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయవద్దా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.