రాహుల్ గాంధీ లోక్‌స‌భ సభ్యత్వం రద్దు పైన పోరాటం చేస్తాం

Congress Leaders Press Meet Over Rahul Gandhi Disqualified. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు.

By Medi Samrat  Published on  24 March 2023 6:15 PM IST
రాహుల్ గాంధీ లోక్‌స‌భ సభ్యత్వం రద్దు పైన పోరాటం చేస్తాం

Congress Leaders Press Meet Over Rahul Gandhi Disqualified


రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవి చీకటి రోజులుగా అభివ‌ర్ణించారు. పార్లమెంట్ ప్రక్రియలకు చీకటి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. తీవ్రమైన నిర్బంధం.. దేశంలో నియంత పాలన సాగుతుందని మండిప‌డ్డారు. గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని.. ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల విశ్వాసం పెరిగింది.. రాహుల్ గాంధీని చూసి బీజేపీ, మోదీ భయపడుతున్నార‌ని అన్నారు. మోదీకి, బీజేపీ కి భయపడం.. న్యాయపరంగా, చట్ట పరంగా మేము కొట్లాడుతామ‌న్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు మాకు ఉందని తెలిపారు.

రాహుల్ గాంధీ మోదీని ఏదో అన్నారని పరువు నష్టం కేసు వేశారు. సూరత్ జిల్లా కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష వేసింది. 30 రోజుల గడువు ఇస్తూ బెయిల్ కూడా ఇచ్చింది. 30 రోజుల గడువు ఉండగానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ ప్ర‌శ్నించారు. గతంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. ఇలా ఎవ్వరు చేయలేదు. రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు పైన పోరాటం చేస్తామ‌ని తెలిపారు.

పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ మధు యాష్కీ అన్నారు. మోదీ, బీజేపీ నియంత పోకడలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యక్తిగత సమస్య కాదని.. ఇది ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాలకు చీకటి రోజుగా అభివ‌ర్ణించారు. తెలంగాణ‌ ప్రజలు ఈ విషయంలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఉద్యమాలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఉధృతంగా పోరాటం చేస్తుంది. న్యాయపరంగా, రాజకీయంగా మా పోరాటాలు ఉంటాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం అన్నారు. మా పోరాటాలు, మేము ప్రశ్నించడం ఆగవు అని అన్నారు.


Next Story