సీఎస్ శాంతికుమారిని క‌లిసిన కాంగ్రెస్ నాయ‌కులు

Congress leaders met CS Shantikumari. తెలంగాణ సీఎస్ శాంతికుమారిని కాంగ్రెస్ నాయ‌కులు సోమ‌వారం క‌లిశారు.

By Medi Samrat  Published on  23 Jan 2023 6:02 PM IST
సీఎస్ శాంతికుమారిని క‌లిసిన కాంగ్రెస్ నాయ‌కులు

తెలంగాణ సీఎస్ శాంతికుమారిని కాంగ్రెస్ నాయ‌కులు సోమ‌వారం క‌లిశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సీఎస్ ను క‌లిసిన వారిలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా.. పంజాగుట్ట సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎస్ ని కోరుతూ కాంగ్రెస్ బృందం వినతి పత్రం అందజేశారు.

భేటీ అనంత‌రం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పంజాగుట్టలో పెట్టిన అంబేద్క‌ర్ విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. విగ్రహాన్ని వీ హనుమంతరావుకి అప్పగించాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ వీహెచ్ కు ఇప్పటివరకూ పోలీస్ స్టేషన్ లో ఉన్న విగ్రహాన్ని అప్పగించలేదు. అంబేద్క‌ర్ విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాలని సీఎస్ ను కోరాం. అంబేద్కర్ ని అవమానించడం దేశంలోని ప్రతి పౌరుడిని అవమానించడ‌మేన‌ని అన్నారు. అంబేద్క‌ర్ కి అవమానం చేస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతలుగా చూస్తూ ఊరుకోం అని అన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో ఎక్కడ తొలగించారో.. అక్కడనే అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరం అని మాజీ మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్య‌క్తం చేశారు. అంబేద్క‌ర్ విగ్రహం తీసివేసిన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.. అంటే ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లే.. అంబేద్క‌ర్ స్ఫూర్తి ప్రభుత్వానికి ఉంటే.. ఆయన విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టాలని డిమాండ్ చేశారు.


పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టాలని దళితులు అందరూ కోరుతున్నారని సీఎస్ కి వివరించామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు తెలిపారు. పంజాగుట్టలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారో.. అక్కడ విగ్ర‌హం ఏర్పాటు చేసే వరకూ తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాన‌ని వీహెచ్ అన్నారు.


Next Story