చంద్రబాబు విడుదల.. టీడీపీ ఆఫీసులో కాంగ్రెస్ నేత సంబరాలు
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
By అంజి Published on 1 Nov 2023 8:21 AM IST
చంద్రబాబు విడుదల.. టీడీపీ ఆఫీసులో కాంగ్రెస్ నేత సంబరాలు
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. అధినేతకు బెయిల్ మంజూరవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగింపులో టీడీపీ నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించగా.. ఆయన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైన దేవాలయం ఇదేనని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ రాజకీయ వరమిస్తే చంద్రబాబు పెంపకంలో నిబద్దత క్రమశిక్షణగా ఎదిగానన్నారు. చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంతోషం టీడీపీ శ్రేణులతో పంచుకోవాలని వచ్చానని అన్నారు. నిజాయితీ, పట్టుదల గల వ్యక్తులు తెలుగుదేశం సొంతమన్న తుమ్మల.. తన విజయంలో మీరు (టీడీపీ శ్రేణులు) భాగస్వాములు కావాలి అని కోరారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న తుమ్మల తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టడంపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు గులాబీ నేతలు.
చంద్రబాబు విడుదలతో ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పోటాపోటీగా సంబరాలు చేసుకున్నారు. లాకారం ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన సంబరాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కమార్ పాల్గొన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ సంబరాలు చేసుకుంది. బాణాసంచా పేల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.