గురుకుల విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

గురుకుల విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

By అంజి  Published on  9 Oct 2024 10:42 AM IST
Congress, conspiring,  Gurukul education, RS Praveen Kumar, telangana

గురుకుల విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్: తెలంగాణలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెలకొల్పిన ప్రతిష్టాత్మక గురుకుల విద్యావ్యవస్థను నాశనం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవిష్యత్తుపై మేధావులు, విద్యారంగ నిపుణులతో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారంటీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన మరో అటెన్షన్ డైవర్షన్ ఎత్తుగడే సమీకృత గురుకులాలు అని అన్నారు. కాంగ్రెస్‌ నేతలకు విద్య మీద ఏ మాత్రం అవగాహన లేదని ఈ సమీకృత గురుకులాల వ్యవహారం చూస్తే తెలుస్తోందన్నారు. ఇంత వరకు తెలంగాణ కు విద్యా శాఖ మంత్రి లేరని అన్నారు. గురుకులాలు అనాది నుండే సమీకృతం అన్న ఇంగింత జ్ఞానం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు, ఎప్పుడన్నా ఆ జీవో లన్ని చదివారా? అని ప్రశ్నించారు.

అసలు ఎలాంటి చర్చ జరగకుండానే, జీవోలు విడుదల కాకుండానే మీరు ఆదరాబాదరాగా సమీకృత గురుకులాల బిల్డింగ్స్ డిజైన్స్ ను ఫైనల్ చేయడం అంటే రూ.5000 కోట్లను మింగేయడానికేనన్న అనుమానం ప్రజలకు కలుగుతోందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఐదు వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు కట్టలేని ప్రభుత్వం, వచ్చే మూడు నెలల్లో రూ.5000 కోట్లు ఖర్చు చేస్తరంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ గురుకుల వ్యవస్థపై ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి , ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు అవగాహన లేదని మండిపడ్డారు. 21 నియోజకవర్గాల్లో సమీకృత పాఠశాలలు నిర్మిస్తున్నామని చెబుతున్నారని, అయితే కేవలం రూ.25 కోట్లతో 2,560 మంది విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడాన్ని ఎలా సమర్థిస్తారు? ఇవి పాఠశాలలా లేక పౌల్ట్రీ ఫారాలా?” విద్యా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ విధానాన్ని సవాలు చేస్తూ ఆయన ప్రశ్నించారు.

అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం గురుకుల వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందని బీఆర్‌ఎస్‌ అధినేత గుర్తు చేశారు.

Next Story