కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి.. ఎలా తెలిసిందంటే..
తెలంగాణలో ఎన్నికల వేళ గతంలో లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 10:55 AM ISTకేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి.. ఎలా తెలిసిందంటే..
తెలంగాణలో ఎన్నికల వేళ గతంలో లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దాంతో.. రాష్ట్ర రాజకీయాల్లో వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. టికెట్ దక్కనివారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ స్క్రూటీని నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అఫిడవిట్‌లోనూ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఆయా పార్టీల నుంచి అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులు ఆస్తులు, సంబంధించిన అప్పుల వివరాలను సమర్పించారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ అఫిడవిట్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల అఫిడవిట్‌లో వివేక్ తన మొత్తం ఆస్తి విలువను రూ.606.2 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో ఈయనే రిచెస్ట్ క్యాండిడేట్. తనకున్న చరాస్తులు, స్థిరాస్తులు, అప్పుల వివరాలను కూడా అఫిడవిట్‌లో తెలిపారు వివేక్. అయితే.. ఆయన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అప్పు ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్‌కు తాను రూ.కోటి అప్పు ఇచ్చినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కే కాదు.. మరో ప్రముఖ నేతకు కూడా అప్పు ఇచ్చారట. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా బాగా రిచ్ అని అందరికీ తెలిసిందే. అయితే.. రాజగోపాల్‌రెడ్డికి కూడా వివేక్ అప్పు ఇచ్చారట. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
రాజగోపాల్‌రెడ్డికి వివేక్ రూ.1.50 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు వివేక్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి రూ.450 కోట్లకు పైగా ఆస్తులతో రెండో రిచెస్ట్ అభ్యర్థిగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి కూడా వివేక్ అప్పు ఇవ్వడం.. ఆయన అఫిడవిట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. రాజకీయంగా ఎంత ప్రత్యర్థులు అయినా.. ఎన్ని విమర్శలు చేసుకున్నా.. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది. సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా వివేక్ వద్ద అప్పు చేయడం ఏంటో అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు.