ప్రభుత్వ అధికారులు BRS కోసం పనిచేస్తున్నారు.. జాబితా రెడీ చేసిన కాంగ్రెస్

తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు బీఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 9:14 PM IST
congress, alleges,  telangana officials, favouring brs,

ప్రభుత్వ అధికారులు BRS కోసం పనిచేస్తున్నారు.. జాబితా రెడీ చేసిన కాంగ్రెస్

తెలంగాణ ప్రభుత్వంలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సీనియర్‌ అధికారులు తమ విధుల మేరకు నడుచుకోకుండా.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ మేరకు అలాంటి వారి జాబితాను రూపొందించింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ జాబితాలో పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్రంలోని రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్‌ల అధికారులు కూడా ఉన్నారు. ఎన్నికల సమయంలో అధికార బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ అధికారుల కార్యకలాపాలపై ధ్వజమెత్తాలని కోరుతూ పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసేందుకు ఈ జాబితాను అందించారు.

ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. ఎన్నికల వరకు పెన్షన్లు తప్ప నిధులు విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు నిబంధనలను అతిక్రమించి వివిధ ప్రభుత్వ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థికశాఖ కార్యదర్శి కృష్ణారావు కొనసాగుతున్నారని.. గత ఎన్నికల్లో ఓటు వేయడానికి క్యూలో వేచి ఉన్న ఓటర్లకు రైతుబంధు నిధుల గురించి సందేశాలు వెళ్లాయని చెప్పారు. అధికార పార్టీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కాంగ్రెస్‌ మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇలాంటి విషయాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆ కమిటీ ఫిర్యాదు చేస్తుంది.

ఈ సందర్భంగా గ్రౌండ్ లెవల్‌ వరకు అనుమానాస్పద కార్యకలాపాలు జరగకుండా చూడాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను, క్యాడర్‌ను రేవంత్‌రెడ్డి కోరారు. నిబంధనలు ఉల్లంఘించడం, తప్పుడు కేసులు నమోదు చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించకోవడం వంటివాటిపై దృష్టి పెట్టనున్నారు.

అయితే.. ప్రభుత్వ సర్వీసులో ఉన్న సివిల్ సర్వెంట్లు అధికారంలో ఉన్న పార్టీ కోసం ప్రచారం చేయొద్దు. కానీ.. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పదాధికారులు ఆరోపించారు. ఈ విషయంలో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆపడం లేదు. పైగా నిరసనలు తెలిపితే పోలీసులతో అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్‌ ప్రభుత్వ దుష్పరిపానలకు సంకేతమని.. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇది గమనించాలని కాంగ్రెస్‌ పార్టీ నేత సామమోహన్‌రెడ్డి అన్నారు.

అక్టోబర్‌ 10న బంజారాహిల్స్ రోడ్‌ నెబర్ 3లో ఓ కారులో రూ.3.35 కోట్లు పట్టుబడిందని.. ఆ డబ్బు ఎవరిదని తెలంగాణ కాంగ్రెస్‌ ఎల్బీనగర్‌ మైనార్టీల అధ్యక్షుడు అబ్దుల్లా సోహైల్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.. ఇప్టపికే మార్కెట్‌లో డబ్బుని తరలిస్తున్నారంటే ఆ డబ్బు బీఆర్ఎస్‌ నాయకులది కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు సరిగ్గా విచారణ చేసి ఎవరిదనేన ప్రకటించాలని అబ్దుల్లా సోహైల్ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి.. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్నందున ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగంలో కొందరి పాత్ర ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

Next Story