హెచ్1బీ- వీసా రిగ్గింగ్ లో కాంగ్రెస్ ఆదిలాబాద్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేరు

ఎన్నారై అయిన కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో హెచ్1బీ-వీసా రిగ్గింగ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకడిగా పేరు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2024 5:00 PM IST
Kandi Srinivas Reddy, H1B-visa rigging

హెచ్1బీ- వీసా రిగ్గింగ్ లో కాంగ్రెస్ ఆదిలాబాద్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేరు

గత ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు కంది శ్రీనివాస్ రెడ్డి. ఎన్నారై అయిన కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో హెచ్1బీ-వీసా రిగ్గింగ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకడిగా పేరు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, హెచ్‌1బీ-వీసా రిగ్గింగ్‌లో భాగమైన కీలక నిందితుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి ఒకరు.

ఇంతకూ ఆ స్కామ్ ఏమిటి?

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో అమెరికా ప్రభుత్వం H-1B వీసాల కోసం లాటరీని నిర్వహిస్తుంది. అదనపు లాటరీ టిక్కెట్లను పొందడం ద్వారా వేలాది కంపెనీలు ప్రయోజనం పొందాయని కొత్త ఫెడరల్ డేటా వెల్లడించింది. "బహుళ రిజిస్ట్రేషన్"గా సూచించే వ్యూహం కూడా అమలు చేశారు. ఒకే వ్యక్తికి వారి అవకాశాలను మెరుగుపరిచేలా ఒకటి కంటే ఎక్కువ లాటరీ ఎంట్రీలను ఇస్తూ వస్తుంటారు. అలా ఫెడరల్ అధికారులను మోసం చేశారు.

నాలుగు సంవత్సరాల కాలంలో ఒక స్టాఫింగ్ సంస్థ ఆపరేటర్ ఒక వ్యక్తికి సంబంధించిన దరఖాస్తుదారును 15 సార్లు నమోదు చేశాడు. ఒక డజను కంపెనీల ద్వారా సదరు వ్యక్తికి లాటరీలో అవకాశం దక్కేలా చేశారు. అలా కొన్ని వందల మందికి H-1B వీసాలు వచ్చేలా చేశారు. వీరు చేసిన పనుల వలన ఇతరులు నష్టపోయారు. బహుళ రిజిస్ట్రేషన్ వ్యూహాలను ఉపయోగించిన కంపెనీలు నాలుగేళ్లలో దాదాపు 40,000 H-1Bలను సొంతం చేసుకోగలిగాయి.

ఇండియన్ అమెరికన్స్ ఫార్మర్స్ కోఆపరేటివ్ కోఆపరేషన్ వ్యవస్థాపకుడు కంది శ్రీనివాస రెడ్డి తరపున 2020 నుండి 300 కంటే ఎక్కువ H-1Bలను అందించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయన కంపెనీల ద్వారా, అతను అనుకున్న అభ్యర్థులకు ఎక్కువగా లాటరీలలో అవకాశాలు లభించాయని నిర్ధారించారు అమెరికా ధికారులు. 2020 నుండి కంది శ్రీనివాస రెడ్డి కంపెనీల తరపున 300 కంటే ఎక్కువ మందికి హెచ్-1 బీ వీసా అవకాశం దక్కిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.

కంది శ్రీనివాస రెడ్డి గ్రూప్ స్టాఫింగ్ కంపెనీల వ్యవస్థాపకుడు, CEO. వందలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత సొంతం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. కంది శ్రీనివాస్ రెడ్డి వీసాలు సంపాదించడానికి 13 కంపెనీలను నిర్వహిస్తున్నారు.

1. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్.

2. డేటా సైన్స్ టెక్నాలజీస్.

3. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీస్.

4. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్.

5. క్లౌడ్ బిగ్ డేటా టెక్నాలజీస్.

6. క్లౌడ్ టెక్నాలజీ గ్రూప్.

7. ఆటోమేషన్ టెక్నాలజీస్.

8. మెషిన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్.

9. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్.

10. ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్.

11. రోబోటిక్స్ టెక్నాలజీస్.

12. 3D టెక్నాలజీస్.

13. డిజిటల్ టెక్నాలజీస్.

కంది శ్రీనివాస రెడ్డి స్పందన:

న్యూస్‌మీటర్‌తో కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హెచ్ 1 బి వీసా అనుమతులు పొందడంలో లేదా తన కంపెనీల ద్వారా అటువంటి అనుమతులు పొందడంలో అసాధారణమైనది ఏమీ జరగలేదని అన్నారు. "2020- 2024 మధ్య వివిధ సంస్థల ద్వారా US ఆమోదించిన మొత్తం వీసాల సంఖ్య 4.25 లక్షలు కాగా, మా వాటా కేవలం 300 మాత్రమే,"అని అన్నారు. వీసా ఆమోదాల సంఖ్య సాపేక్షంగా తక్కువగా ఉందని అన్నారు. "నేను నా ఎన్నికల అఫిడవిట్‌లో నా కంపెనీల పేర్లు.. సంబంధిత వివరాలను ఇచ్చాను. ప్రతిదీ బోర్డు పైన ఉంది," అన్నారాయన.

తన స్టాఫింగ్ కంపెనీల పనితీరును శ్రీనివాసరెడ్డి వివరించారు. అమెరికా పౌరులు కూడా తన కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు. కంపెనీలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేస్తున్నామని ఆయన అన్నారు. వీసా రిగ్గింగ్ కుంభకోణం ఆరోపణల విషయానికొస్తే.. తాను రాజకీయాల్లో ఉన్నందున ఈ ఆరోపణలు వచ్చాయన్నారు. ఒక రాజకీయ నాయకుడిపై స్కామ్ ఆరోపణలు చేస్తే పాపులారిటీ వస్తుందని అనుకుంటారని ఆయన విమర్శించారు.

అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకుని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రభుత్వ నియమ నిబంధనలను లోబడి కొనసాగుతున్న తన వ్యాపారాలను దెబ్బతీయడానికి తన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలు ఫలించవని కంది శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తన మీద, తన కంపెనీల మీద కొందరు పనిగట్టుకని, వాస్తవాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, లీగల్‌ నోటీసులు పంపిస్తానని అన్నారు.

కంది శ్రీనివాస్ రెడ్డి ఎవరు?

ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్ గ్రామానికి చెందిన కంది శ్రీనివాస రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యాపారం చేస్తున్నారు. 2022 ప్రారంభంలో ఆదిలాబాద్‌లో నియోజక వర్గంలో కంది శ్రీనివాస్‌రెడ్డి పోస్టర్‌లు కనిపించడంతో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ఆయన బీజేపీ సీనియర్ నాయకుడు బిఎల్ సంతోష్‌ ను కూడా కలిశారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి ఎంటర్ అయ్యారు. నియోజకవర్గంలోని మహిళా ఓటర్లకు ప్రెషర్‌ కుక్కర్‌లు పంపిణీ చేసి పాపులర్ అయ్యారు. మహిళా ఓటర్లను ప్రభావితం చేశారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. ఆయన ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారనే చర్చ కూడా జరిగింది. అతని ఐటీ సంస్థ దాదాపు రూ.800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అప్పటి ఎంపీ రేవంత్ అనుముల అమెరికా వెళ్లిన సమయంలో కంది శ్రీనివాస్ రెడ్డి వారి టూర్ కు నిధులు సమకూర్చినట్లు ప్రచారం జరిగింది.

ఆ తర్వాత ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. అయితే, అతను 3వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన జోగు రామన్నను కాంగ్రెస్‌లో చేరకుండా చేయడంలో ఆయన పాత్ర ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కుటుంబానికి 'అమ్మ భారత్' అనే న్యూస్ ఛానెల్ ఉంది.

సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా 2022లో బీజేపీ మద్దతుదారుగా స్థానిక రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి టిక్కెట్టుపై హామీ ఇవ్వడంతో ఆయన పార్టీ మారారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కంది శ్రీనివాస రెడ్డి తన సామాజిక సేవా కార్యక్మాల్లో భాగంగా నియోజక వర్గంలోని 45,000 మంది ఓటర్ల కుటుంబాల మహిళలను లక్ష్యంగా చేసుకుని ప్రెషర్ కుక్కర్‌లను బహుమతిగా ఇచ్చారు.

కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ప్రెషర్ కుక్కర్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఒక్కో 5-లీటర్ కుక్కర్ ధర రూ. 1,000 కంటే ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 28,000 కుటుంబాలను కవర్ చేయడానికి.. 32,000 యూనిట్ల కోసం ఆర్డర్ ఇచ్చారు.

Next Story