హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆమెకు సికింద్రాబాద్ లోని సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ. 10 వేల పూచీకత్తుతో పాటు, ఇద్దరు వ్యక్తుల షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గత 17 రోజులుగా చంచల్ గూడ జైల్లో రిమాండులో అఖిలప్రియ కు బెయిల్ మంజూరు కావడంతో రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో భార్గవ్ రామ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరారు. ఈ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉండగా, భార్గవ్ రామ్ ఏ3గా ఉన్నారు. సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు అఖిల ప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
17 రోజుల క్రితం కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు ఇప్పటికే ఈ కేసులో మరో 19 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిలు మంజూరు చేయాలని అఖిలప్రియ తరపు న్యాయవాది వాదిస్తూ వచ్చారు. ఆమెకు సంబంధించిన పూర్తి వైద్య చికిత్స నివేదికను కోర్టుకు కూడా అందజేశారు. 15 రోజులకు ఒకసారి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆమెకు సూచించింది.