తెలంగాణలో మరో రూ.647 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న కోకాకోలా
తెలంగాణలో కోకాకోలా కంపెనీ తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 6:01 AM GMTతెలంగాణలో మరో రూ.647 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న కోకాకోలా
తెలంగాణకు పెద్ద కంపెనీలు వరుస కడుతున్నాయి. ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కోకాకోలా కంపెనీ తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశం అయ్యారు. తమ సంస్థకు భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని కేటీఆర్‌తో చెప్పారు. అందుకే తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేస్తున్నట్లు జేమ్స్ మేక్ గ్రివి మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.
సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్‌లో అదనంగా రూ. 647 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా లో రూ.1,000 కోట్లతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణానికి.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఓంవోయూ కుదుర్చుకుంది. అయితే.. వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో రూ.647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్ధిపేట జిల్లా ప్లాంట్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేమ్స్ మేక్ గ్రివి తెలిపారు. అయితే.. నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24 వరకు పూర్తి అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
రెండో నూతన తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కోకాకోలా సంస్థ ప్రకటించింది. కరీంనగర్ లేదంటే వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో కోకాకోలా కంపెనీ దాదాపుగా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని కోకాకోలా కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.
తెలంగాణలో కోకాకోలా కంపెనీ తన పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని.. అన్ని వనరులు ఉన్నాయి కాబట్టే కంపెనీలో రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయనేదానికి కోకాకోలా కంపెనీ తాజా నిర్ణయం నిదర్శనమని చెప్పారు.