హైదరాబాద్: కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సాయాన్ని ఆర్ధిస్తూ జనగామ కలెక్టరేట్‌కు వెళ్లింది. ఎవరూ స్పందించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. రూ.4 వేల పెన్షన్ డైపర్లకే సరిపోవడం లేదని, ఇందిరమ్మ ఇల్లు, జీరో కరెంటు బిల్లు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూలీ పనులకు వెళ్లే తాము పథకాలకు అర్హులం కాదా? తమను ఆదుకోండి లేదంటే తన కొడుకును చంపేయండి అని లక్ష్మీ అనే మహిళ రోదించింది. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాజాగా ఈ వీడియో సీఎం రేవంత్ దృష్టికి వచ్చింది.
''జనగామలోని కుర్మవాడకు చెందిన పర్శ సాయి దీన పరిస్థితి నా దృష్టికి వచ్చింది. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి పై వివరాలు తెలుసుకుని.. ప్రభుత్వం వైపు నుండి చేయగలిగిన సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించాను. నా ఆదేశాల మేరకు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ఈ రోజు పర్శ సాయి ఇంటిని సందర్శించారు. వారికి ఇందిరమ్మ ఇల్లు.. ఆ కుటుంబ ఉపాధికి రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాయికి నిమ్స్ లో వైద్య సహాయం అందించడానికి నిర్ణయం తీసుకున్నాను'' అని సీఎం రేవంత్ తెలిపారు.